ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపి ఫోరెన్సిక్ వర్కుషాప్ (ఎపిఎఫ్‌ఎస్‌ఎల్)ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డిజిపి హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. వర్కుషాప్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విచారణాధికారులకు, డాక్టర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఫోరెన్సిక్ ఆధారాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వర్కుషాప్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ భౌతిక ఆధారాలను శాస్త్రీయంగా వెలికితీయడంలో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. సిఎం చంద్రబాబు మానసపుత్రిక ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (ఎపిఎఫ్‌ఎస్‌ఎల్) నిర్మాణాలు ముగింపు దశకు చేరుకున్నాయని, 2026 మార్చి నాటికల్లా ఇవి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. తుళ్లూరులో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఎపి ఫోరెన్సిక్ విభాగం డైరెక్టర్ జి పాలరాజు ఆధ్వర్యాన ఈ వర్కుషాప్ జరగనుందని పేర్కొన్నారు.
