కొల్లేరు ఆక్రమణలపై అటవీ శాఖ సర్వే

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : కొల్లేరు సరస్సు ఆక్రమణలపై అటవీశాఖ అధికారులు సర్వే ప్రారంభించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కొల్లేరు ఐదో కాంటూరు పరిధిలోని సరిహద్దులకు సంబంధించిన నిర్ధారణపై వివరాలు తెలుసుకునేందుకు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రాష్ట్ర ఉన్నతాధికారి ఎకె.నాయక్‌, రాజమండ్రి ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ ఫారెస్ట్‌ అధికారి బిఎన్‌ఎన్‌.మూర్తి, జిల్లా ఫారెస్ట్‌ అధికారి విజయ, టెరిటోరియల్‌ డిఎఫ్‌ఒ త్రిశుభం, ఇతర ఫారెస్టు అధికారులు ఆదివారం కొల్లేరు ప్రాంతంలో పర్యటించారు. కొల్లేరు చిత్తడి నేలల పరిధిలో ఉండటంతో అధికారులు ఐదో కాంటూరుకు సంబంధించి సరిహద్దుల నిర్ధారణపై పరిశీలనకు దిగారు. కొల్లేరు ప్రాంతాలైన కలకుర్రు, పులపర్రు, గుడివాకలంక వద్ద మాధవాపురం, పత్తికోళ్లలంలో డోన్ల సహాయంతో సరిహద్దులను పరిశీలిస్తున్నారు. గతంలో నిర్ణయించిన సరిహద్దులు కొన్నిచోట్ల సరిపోతుండగా మరికొన్ని చోట్ల జిరాయితీ భూముల్లో సరిహద్దులు ఉన్నట్లుగా తెలిసింది. కొల్లేరు సరిహద్దులను పూర్తి స్థాయిలో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు దీనిపై పూర్తిగా నిమగమయ్యారు. సరిహద్దుల నిర్ణయంలో ఎదురవుతున్న ఇబ్బందులను సుప్రీం కోర్టుకు తెలిపేందుకు ఉన్నతాధికారులే నేరుగా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్త్తోంది. 2024 డిసెంబర్‌లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతో కొల్లేరు ఐదో కాంటూరులోపు ఉన్న అక్రమ చెరువులను గండ్లు కొట్టే ప్రక్రియ సాగుతోంది. ఇప్పుడు కొల్లేరు సరిహద్దుల నిర్ణయంపైన సుప్రీం కోర్టులో మరో కేసు ఉండడంతో ఆ పని తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సైతం కొల్లేరులో పర్యటనకు రావడంతో అక్కడి ప్రజల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.

➡️