అఖిలపక్షం ఏర్పాటు చేయండి

  • అగ్రిగోల్డ్‌ బాధితుల ధర్నాలో రామకృష్ణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే అఖిలపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో మహా విజ్ఞాపన దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల పక్ష నేతల సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు సమర్థ వంతమైన అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పదేళ్లుగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. నిబద్దత కలిగిన విశ్రాంత ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావు లాంటి అధికారులతో క మిటీ వేస్తే సత్వరమే సమస్య పరిష్కారమవుతుం దన్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణ రావు మాట్లాడుతూ త్వరలో జరుగనున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో వాయిదా తీర్మానం ద్వారా అగ్రిగోల్డ్‌ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాలకు అండగా ఉంటామన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వై.వెంకటేశ్వరరావు(వైవి) మాట్లాడుతూ ఐక్యంగా పోరాటాలు చేస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదన్నారు. అగ్రిగోల్డ్‌ సమస్య కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్యగా ప్రభుత్వం గుర్తించి సత్వరమే సమస్యను పరిష్కరించాలన్నారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ అగ్ర్రిగోల్డ్‌ బాధితుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే ఈ సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుందన్నారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావుల పల్లి రవీంధ్రనాథ్‌ మాట్లాడుతూ ఒకే ఒక లక్ష్యంగా పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులకు ఎఐటియుసి సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందన్నారు. అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు బాలకోటయ్య మాట్లాడుతూ మోసం చేసిన కంపెనీ ఆస్తులు అమ్మి సమస్యను పరిష్కరించాలని కోరటం న్యాయమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజరుకుమార్‌, అగ్రిగోల్డ్‌్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, అధ్యక్షులు ఇవి నాయుడు, కార్య నిర్వాహక అధ్యక్షులు ఎస్‌ మల్లికార్జున, ఉప ప్రదాన కార్యదర్శి బివి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. సాయంత్రం టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య శిభిరాన్ని సందర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. అనంతరం దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

➡️