రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల పనుల పూర్తికి టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ఏర్పాటు

Nov 30,2024 07:40 #bc janardhan reddy

 మంత్రి జనార్థన్‌ రెడ్డి

ప్రజాశక్తి – బనగానపల్లె (నంద్యాల జిల్లా)  : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల పనులను త్వరగా పూర్తి చేసేందుకు రెండు వేర్వేరు టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ క్లియరెన్స్‌ అనుమతులు, లెవెల్‌ క్రాసింగ్‌ మూసివేతలకు అనుమతులు, యుటిలిటీస్‌ షిప్టింగ్‌, నిధుల విడుదల వంటి అంశాలను పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించి, వేగవంతంగా పూర్తి చేసేందుకు తన ఆధ్వర్యంలో 9 మందితో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీలో రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, సిసిఎల్‌ఎ ఛీప్‌ కమిషనర్‌, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ ఛీప్‌ కన్సర్వేటర్‌, ఆర్‌అండ్‌బి (ఆర్‌ఎస్‌ డబ్ల్యూ) శాఖ చీఫ్‌ ఇంజనీర్‌, ఛీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (కనస్ట్రక్షన్‌-వాల్తేర్‌), చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (కనస్ట్రక్షన్‌-రోడ్‌ సేప్టీ ప్రాజెక్ట్స్‌- సికింద్రా బాద్‌), ఛీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (కనస్ట్రక్షన్‌-సికింద్రాబాద్‌), చీఫ్‌ ఇంజనీర్‌ (కనస్ట్రక్షన్‌-బెంగళూరు) సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారి పనులను త్వరితగతిన పూర్తిచేయడానికి 12 మందితో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో జలవనరుల శాఖ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ, విద్యుత్‌ శాఖ స్పెషల్‌ ఛీఫ్‌ సెక్రటరీ, సీసీఎల్‌ ఎ ఛీఫ్‌ కమిషనర్‌, పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, గనులు, భూగర్భవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ ఛీప్‌ కన్సర్వేటర్‌, రీజనల్‌ ఆఫీసర్‌ (ఎంఒఆర్‌టిహెచ్‌-ఎపి), రీజనల్‌ ఆఫీసర్‌ (ఎన్‌హెచ్‌ఎఐ- ఎపి), ఆర్‌ అండ్‌ బీ, ఆర్‌ఎస్‌డబ్ల్యూ ఛీఫ్‌ ఇంజనీర్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (కనస్ట్రక్షన్‌ – రోడ్‌ సేప్టీ ప్రాజెక్ట్స్‌ – సికింద్రాబాద్‌ ) సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ రెండు కమిటీలు ప్రతి నెలా సమావేశమై పనులను వేగవంతం చేయడానికి చర్యలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

➡️