- విజయవాడ నేతలు, కార్పొరేటర్ల భేటీలో మాజీ సిఎం వైఎస్ జగన్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసిపి తప్పకుండా గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రాన్ని 30 ఏళ్లపాటు పాలించడం తథ్యమని మాజీ సిఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో బుధవారం విజయవాడ వైసిపి నేతలు, కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తన పాలన 1.0లో ప్రజలందరికీ మేలు చేయాలనే తపనతో కార్యకర్తలకు అంతగొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందన్నారు. తాను కార్యకర్తల కోసం తమ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చేసి చూపిస్తామన్నారు. తన హయాంలో ప్రజల సంక్షేమం కోసమే అడుగులు వేశానని, నేడు చంద్రబాబు ప్రభుత్వం వైసిపి కార్యకర్తలను ఎలా ఇబ్బందులు పెడుతుందో చూస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయని, ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటామో అన్నదే మనల్ని నాయకుల్ని చేస్తుందన్నారు. కష్టం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిత్వం కోల్పోకూడదన్నారు. కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా తన కథను గుర్తు పెట్టుకోవాలని, తాను రాజకీయంగా ఎదుగుతానని కాంగ్రెస్, టిడిపి నేతలు దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారన్నారు. తాను బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరించడం, దొంగకేసులు పెట్టి జైలుకు పంపుతారని, అయినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో 64 స్థానాలుంటే 49 స్థానాలు గెలిచామని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన సభ్యులను 13 మందిని తీసుకున్నప్పటికీ ఇంకా 38 మంది ప్రలోభాలకు లొంగకుండా ఉన్నారని చెప్పడానికి తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు.
టిడిపి ఎన్నికల హామీలు, సూపర్‌సిక్స్ అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతోందని, ప్రజల్లోకి వస్తే పథకాల సంగతి ప్రశ్నిస్తారనే భయంతో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయని, నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, ఇండిస్టీ, మైనింగ్ చేసుకోవాలన్నా ‘నాకు ఇంత’ అని ఎమ్మెల్యే దగ్గర నుంచి సిఎం స్థాయి వరకు పంచుకుంటున్నారని జగన్ ఆరోపించారు.