మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి

May 21,2024 20:59 #death, #East Godavari, #ex mla, #TDP

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ :ప్రముఖ రాజకీయవేత్త, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు (71) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల ఆయన భార్య అనారోగ్యంతో మృతి చెందారు. 1983 నుంచి 94 వరకూ వరుసగా నాలుగుసార్లు కొవ్వూరు నుంచి టిడిపి ఎమ్మెల్యేగా కృష్ణబాబు ఘన విజయం సాధించారు.1999లో ఓటమి చెంది, 2004లో ఐదోసారి ఎమ్మెల్యే గెలిచి ఆయన రికార్డు సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి సన్నిహితుడు కావడంతో వైసిపిలో కొన్నేళ్ల క్రితం చేరారు. 2009లో కొవ్వూరు నియోజకవర్గం ఎస్‌సి రిజర్వు కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి తానేటి వనితకు కొవ్వూరు అసెంబ్లీ వైసిపి టికెట్‌ ఇప్పించడంతోపాటు ఆమె విజయానికి కృషి చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో కృష్ణబాబు చక్రం తిప్పారు. టిడిపిలో ఉండగా కొవ్వూరు నియోజకవర్గంతో పాటు పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు.

➡️