ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి తప్పుపట్టడం సహేతుకం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వివాదంలో ఎటువంటి నిర్ధారణా లేకుండా ఎలా మాట్లాడతారని సిఎం చంద్రబాబును సుప్రీంకోర్టు ప్రశ్నించడాన్ని బిజెపి నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. లడ్డూ అంశంపై మాట్లాడే హక్కు సిఎం చంద్రబాబుకు ఉందని పురంధేశ్వరి చెప్పడం తగదన్నారు. కోర్టులపై టిడిపి కూటమి ప్రభుత్వానికి నమ్మకం లేదన్నారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడారని ప్రపంచంలోని అన్ని మతాల వారు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయం కోర్టు కూడా అభిప్రాయపడిందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు తీరును కోర్టు తప్పుపడితే.. బిజెపి నాయకులు బాబును వెనుకేసుకురావడం తగదన్నారు.