- పది గంటల నిర్బంధం తర్వాత హరీశ్ విడుదల
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసు అధికారులను కలిసేందుకు బుధవారం బంజారాహిల్స్ పిఎస్‌కు కౌశిక్‌రెడ్డి వెళ్లారు. ఆ సందర్భంలో సిఐతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో విధులకు ఆటంకం కలిగించారంటూ సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మంది పై కేసు నమోదైంది. గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకు నేందుకు ప్రయత్నించగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. కాసేపటికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీశ్‌ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకు దిగిన బిఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు బిఎన్‌ఎస్ 57, 126(2), 127(2), 132, 224, 333, 451(3), 191(2), రెడ్‌విత్ 190, రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఉదయం 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పిఎస్‌లో హరీశ్ రావును నిర్బంధించిన పోలీసులు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు. పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, పలువురు బిఆర్‌ఎస్ నేతలు కలిశారు. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు కౌశిక్‌రెడ్డిని హాజరుపర్చే అవకాశం ఉంది.