పిన్నెల్లి ప్రధాన అనుచరుడు అరెస్టు

ప్రజాశక్తి- విజయపురి సౌత్‌ (పల్నాడు జిల్లా) : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌, విజయపురిసౌత్‌ ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ షఫీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. ఆదివారం హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. వైసిపి ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక దౌర్జన్యాలు అక్రమాలు చేసినట్లు కిషోర్‌ పై అరోపణలు ఉన్నాయి. పిన్నెల్లి అండతో మాచర్ల నియోజకవర్గంలో పలు అరాచకాలతో పాటు 2020 లో స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలనకు వచ్చిన టిడిపి నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై తురకా కిషోర్‌ దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడి కేసులో తురకా కిషోర్‌ ప్రధాన నిందితుడు. జనరల్‌ ఎన్నికలరోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలు అనంతరం ఆయన అందుబాటులో లేకుండా పోయారు. ఏడు నెలల తరువాత హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం తెలుసుకొని పోలీసులు అరెస్టు చేసి, హైదరాబాదు నుండి నిందితుడు తురకా కిషోర్‌ను పోలీసులు తీసుకువస్తున్నట్లు విజయపురిసౌత్‌ పోలీసులు తెలిపారు.

➡️