ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రజాచైతన్యానికి సాంస్కృతిక రంగం కీలకమని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ అన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన ఫూలే అంబేద్కర్ భవనంలో ‘సాంస్కృతిక రంగం – ప్రభుత్వ బాధ్యత’ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మానవీయ విలువలు పెంచే, సమాజాభివృద్ధిని కాంక్షించే ప్రజా సంస్కృతి పెంపుదలకు ప్రభుత్వం ఏ మాత్రమూ బాధ్యత వహించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజానాట్యమండలి వంటి ప్రజా కళాసంస్థలు ఐక్యంగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం నిర్వహించాలని అన్నారు. ప్రజలకు సంబంధం లేని అనేక విషయాలను ప్రభుత్వాలు బూతద్దంలో చూపుతూ ముఖ్య సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేస్తోందని తెలిపారు. పేదల సమస్యలు ప్రభుత్వానికి అప్రధాన అంశంగా మారాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజానాట్యమండలి లాంటి సంస్థలు ప్రజలను మేల్కొలపాలని సూచించారు. ప్రజా సంస్కృతిని కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో ముంచిన ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రభుత్వాలు వాటి ధర్మాన్ని నిర్వర్తించేలా పిఎన్‌ఎం లాంటి సంస్థలు పోరాడాలని కోరారు. లౌకిక ప్రజాస్వామ్య సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సినీనటులు, నాటక రంగ ప్రయోక్త కృష్ణేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల కళ్లకు కట్టినట్లు కళాకారులు చూపించే కార్యక్రమం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పారు. మానవత్వం, నైతిక విలువల పరిరక్షణలో నాటక ప్రక్రియది కీలక, ప్రత్యక్ష పాత్రని తెలిపారు. కన్యాశుల్కం నాటకం ఆనాటి సమాజ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బిజెపి చెబుతున్న ఏక్తా భావం వెనుక ఉన్న కుట్రలను నాటకం ప్రజలకు చూపిస్తుందని తెలిపారు. లడ్డూ వివాదం అత్యంత పనికిమాలిన విషయమని పేర్కొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నాటక రంగ విశ్లేషకులు మంతెన సీతారాం, పిఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు మంగరాజు, గాదె సుబ్బారెడ్డి, వివిధ కళా సంస్థల తరుపున వొరప్రసాదు, హెచ్‌విఆర్‌ఎస్ ప్రసాదు, కొనాడ అశోక్, వడ్లమూడి పద్మ, మోతుకూరి అరుణ్‌కుమార్, ఎల్‌ఎస్‌ఆర్‌కె ప్రసాదు, నరేన్, యువి రత్నం, శివశంకర్ తదితరులు మాట్లాడారు. తొలుత ప్రజానాట్యమండలి పతాకాన్ని మంగరాజు ఆవిష్కరించారు.
