- యుటిఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ప్రభుత్వ విద్యా రంగాన్ని బతికించుకోవాలని, దీనికి అందరూ మరింత కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పిలుపునిచ్చారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న యుటిఎఫ్ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభ మంగళవారం మూడవ రోజుకు చేరింది. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతినిధుల ప్రారంభ సభ జరిగింది. ఎంవిఎస్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ.. కర్తవ్య నిర్వహణకు మన భావజాలం వ్యాప్తి చెందాలన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ నమ్మకమైన ప్రాణమిత్రులన్నారు. 2047 డాక్యుమెంట్‌లో విద్యను బలోపేతం చేయడం కానీ, ఖాళీలను భర్తీ చేయడం కానీ లేవన్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలే మనకు గతి అనే భ్రమను వీడాలని సూచించారు. దేశ సమగ్రత, లౌకికతత్వం కాపాడుకోవడానికి ఉపాధ్యాయులు శాయశక్తుల కృషి చేయాలని కోరారు. సమర్ధులు, విజ్ఞులు సమాజంపై బలమైన ప్రభావం చూపించకపోతే స్వార్థపరులు బలపడతారని తెలిపారు. సోషల్ మీడియాను మనం నిరేకదశించాలి తప్ప, సోషల్ మీడియాకు మనం బానిసలం కాకూడదన్నారు.
మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 50 ఏళ్ల ఉపాధ్యాయ ఉద్యమంలో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వమైనా గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలని కోరారు. వచ్చే ఐదారేళ్లలో ప్రభుత్వ విద్యారంగం మరింత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందన్నారు. నేటి పాలకులు భారత లౌకిక రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలోనూ, సంఘంలోనూ ఐక్యతను తీసుకురావడానికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాబోయే గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజలతో ఉపాధ్యాయులు నిరంతరం మమేకం కావాలని సూచించారు. నిరంతరం అధ్యయనం చేయాలని, క్రియాశీలక పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
స్వర్ణోత్సవ మహాసభకు ముఖ్య అతిథిగా కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి విచ్చేసి సౌహార్ధ సందేశం చేశారు. సమాజంలో ఏదైనా మార్పు రావాలంటే గురువుల ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. తన తల్లిదండ్రులు కూడా కడప జిల్లాలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని తెలిపారు. యుటిఎఫ్ తరపున కలెక్టర్‌కు జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. తరువాత యుటిఎఫ్ సంక్షేమ పథకం బాండ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రతినిధుల సభ జరిగింది. కార్యదర్శి నివేదికను యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్.ప్రసాద్, ఆర్థిక నివేదికను ఎమ్మెల్సీ గోపిమూర్తి, ఐక్య ఉపాధ్యాయ పత్రిక నివేదికను కుమార్‌రాజా ప్రవేశ పెట్టారు. వీటిపై జిల్లాల వారీగా ప్రతినిధులు చర్చించారు.