శ్రీకాకుళంలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలి : మాజీ ఎంపి మిడియం బాబూరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళంలో ఐటిడిఎ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కో చైర్మన్‌, మాజీ ఎంపి డాక్టర్‌ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐటిడిఎలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా చట్టం ప్రకారం గ్రామసభల ఆమోదం లేకుండా చేయడానికి వీల్లేదన్నారు. జిల్లాల పునర్విభజనతో ఐటిడిఎ లేని అన్ని జిల్లాల్లో ఐటిడిఎలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పాలకుల తీరుతో జిసిసి నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. అటవీ ఉత్పతుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో జిసిసి కొనుగోలు చేయడం మానేసిందని, ఇదే అదనుగా వ్యాపారులు, దళారులు గిరిజనుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోపిడీ సాగిస్తున్నారని వివరించారు. జిసిసి, అటవీశాఖకు మధ్య 2022లో ఒప్పందం జరిగిందని ఇది ఐదేళ్ల వరకు అమల్లో ఉంటుందన్నారు. దీని ప్రకారం అన్ని రకాల ఉత్పత్తులతోపాటు ప్రభుత్వం నిషేధం విధించిన వెదురు వంటి వస్తువులను గిరిజనులు సేకరించడానికి, అనుభవించడానికి, సంతల్లో అమ్ముకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే జిసిసికి నిధులు కేటాయించి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని పలుమార్లు గవర్నర్లకు వినతిపత్రాలు అందించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఐదో షెడ్యూల్‌లో లేకపోయినా ఆరో షెడ్యూల్‌లోని నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గ్రామసభ ఆమోదం లేనిదే పవర్‌ప్లాంట్లు, ప్రాజెక్టులు, గనుల తవ్వకం వంటి పనులు చేపట్టడానికి వీల్లేదని బూర్జ-సరుబుజ్జిలి మధ్య ప్రతిపాదిత థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.అప్పారావు, నిమ్మక అప్పన్న, జిల్లా ఉపాధ్యక్షులు సవర పురుషోత్తం పాల్గొన్నారు.

➡️