- ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీం సూచన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సుప్రీంకోర్టులో మాజీ ఎంపి నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ హత్య కేసులో ఆయనకు బెయిల్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. మరియమ్మ హత్య కేసులో హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సురేష్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు సురేష్ తనకు ఎటువంటి నేర చరిత్ర లేదని పేర్కొన్నారని, అయితే అప్పటికే ఆయనపై ఐదు కేసులు ఉన్నాయని తెలిపారు. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేశారని, 36 మందితో ఉన్న ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేకుండా ఒత్తిడి తెచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు అయినప్పుడు ఆయన ఎంపిగా ఉన్నారని, ఆయన పార్టీ అధికారంలో ఉండటంతో మూడేళ్లుగా దర్యాప్తులో పురోగతి లేదని అన్నారు. ట్రయల్ కోర్టు ఈ అంశాలను పరిగణనలో తీసుకుని, దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని పేర్కొని, బెయిల్ నిరాకరించిందని తెలిపారు.
నందిగం సురేష్ తరపు సీనియర్ న్యాయవాది మహేష్ జఠ్మలాని వాదనలు వినిపిస్తూ.. బెయిల్ మంజూరుకు నేర చరిత్రతో సంబంధం లేదని అన్నారు. అందుకు 2012, 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుని నేర చరిత్ర ఉందా? లేదా? అనేది సమస్య కాదని, నేర చరిత్రను దాచిపెట్టడమే ప్రధానమైన అంశమని పేర్కొంది. పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది.