- సిఐడి విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి
ప్రజాశక్తి – కంకిపాడు : తన చుట్టూ ఉన్న కోటరీ నుంచి బయటపడిన రోజే జగన్‌కు భవిష్యత్ ఉంటుందని మాజీ ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, ప్రజలు, పార్టీ నష్టపోతుందన్నారు. సిఐడి విచారణలో భాగంగా కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపల్ పరిధి కానూరులో గల సిఐడి కార్యాలయానికి బుధవారం విజయసాయిరెడ్డి వచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు అధికారులు విచారించారు. విచారణ అనంతరం బయట మీడియాతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సిఐడి కేసులో కర్త, కర్మ, క్రియ అన్ని విక్రాంత్ రెడ్డేనని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో కూడా తన ప్రమేయం లేదన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారి, పాత్రధారి అని ఇంతకు ముందే తెలియచేశానని చెప్పారు. వైసిపిలో విశ్వసనీయతో పని చేశానని, కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించారని చెప్పారు. తాను దిగిన మెట్లపై వారు పైకెక్కారని తెలిపారు. చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారన్నారు. కొందరి వల్ల జగన్‌కు తాను దూరమయ్యానని, జగన్ మనసులో తనకు స్థానం లేదని, అందువల్ల వైసిపిని వీడుతున్నట్లు నేరుగా జగన్‌కు చెప్పానని వెల్లడించారు.