ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు : వైసీపీ మాజీ ఎంపీ

Jun 8,2024 15:30 #press meet, #YCP ex-MP

అమరావతి : ఏపీలో వైసీపీ ఓటమికి గల కారణాలను తెలుసుకోవడానికి ఆ పార్టీకి చెందిన మాజీలు అన్వేషణలో పడ్డారు. ఫలితాలు వెలువడి ఐదు రోజులు కావస్తున్న జరిగిన పొరపాటును సవరించు కోవడానికైనా తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే జగన్‌ను మరోసారి పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారని అనుకున్నాం . గడపగడపకు తిరిగిన సమయంలో ప్రజల ఆదరణను చూస్తే వైసీపీకి భారీ మెజార్టి వస్తుందని భావించాం. కాని అనుహ్యంగా ఓడిపోయాం. ఏం జరిగిందో ఇంకా అంతుచిక్కడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఏం తక్కువ చేశామని ఓడిపోయాం.
జరిగిన తప్పులను సవరించుకోవడానికైనా లోపాలు అంతుపట్టడం లేదని అన్నారు. తమ సొంత వ్యాపారాలు పక్కనపెట్టి, ప్రజలకే జీవితాన్ని అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. సొంత పనులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, కుటుంబాలను, వ్యక్తిగత పనులను పక్కనపెట్టి, అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేశామని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును సానుకూలంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

➡️