హైదరాబాద్ : హైదరాబాద్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కుని చిన్నారి మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మెహదీపట్నంలోని సంతోష్ నగర్ కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన శ్యామ్ బహదూర్ వాచ్ మెన్‌గా సంతోష్ నగర్ కాలనీలోని ముజ్తాబా అపార్ట్‌మెంట్‌లో పనిలో చేస్తున్నారు. భార్య, కుమార్తె, కుమారుడు సురేందర్‌తో కలిసి లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్నగదిలో ఉంటున్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్ నొక్కడంతో.. తలుపులు క్లోజ్ కాకుండానే లిప్ట్ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్‌లోనే ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో ఉన్న బాలుడిని అపస్మారకస్థితిలో కనిపించడంతో.. తల్లిదండ్రులు రోదిస్తుండగా.. అపార్ట్‌మెంట్ వాసులు బాలుడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీటి మున్నీరుగా విలపించారు.
