- ఎన్‌పిఎ డైరెక్టర్ అమిత్ గార్గ్ వెల్లడి
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు నలుగురు చొప్పున యువ ఐపిఎస్ అధికారులు కేటాయించబడ్డారని సర్దార్ వల్లభ్‌భారు పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌విపిఎన్‌పిఎ) డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. వారిలో ముగ్గురు మహిళా ఐపిఎస్‌లు ఉన్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రాకు కేటాయించడిన నలుగురిలో ఇద్దరు ఆంధ్రా వారు కాగా ఒకరు తమిళనాడు, మరొకరు హర్యానాకు చెందిన వారు ఉన్నారని చెప్పారు.
గత ఏడాది కాలంలో శిక్షణ నిమిత్తం అకాడమీకి వచ్చిన 188 మంది ఐపిఎస్ అధికారులకు శాంతిభద్రతల పరిరక్షణ, నేర నిరోధం, ఫోరెన్సిక్ సైన్స్, భారత నూతన చట్టాలు, ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు పెరిగిపోతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా నిరోధంపై కట్టుదిట్టమైన శిక్షణనివ్వటం జరిగిందని వివరించారు. శుక్రవారం దీక్షాంత్ పరేడ్ ఉంటుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు. వైద్య వృత్తి నుంచి సివిల్ సర్వీస్‌లోకి, అది కూడా ఐపిఎస్ అధికారులుగా ఎంపిక కావటం వెనక ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అన్ని విధాలుగా న్యాయం చేయవచ్చనే తమ లక్ష్యం ఉన్నదని పలువురు యువ ఐపిఎస్ అధికారులు తెలిపారు. విలేకరుల సమావేశంలో అమిత్ గార్గ్‌తో పాటు జాయింట్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.