తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు దుర్మరణం

Jan 9,2025 08:06 #death, #Tirumala, #ttd
  • వైకుంఠ ద్వార దర్శనం క్యూలైన్లలో ఘటన
  • చంద్రబాబు, జగన్‌ దిగ్భ్రాంతి
  • నేడు బాధితులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, తిరుమల, తిరుపతి సిటీ : తిరుపతిలో ఘోరం జరిగింది. వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు పోటెత్తడంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వారిలో ముగ్గురు విశాఖకు చెరదిన వారు ఉన్నారు. మరో 44 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుపతిలోని విష్ణు నివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూలు వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శిస్తారని సిఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఏం జరిగింది…?

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం (10వ తేది) నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి దర్శనం కోసం గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. దీనికోసం తిరుపతిలో ఎనిమిది ప్రాంతాల్లో 94 టోకెన్‌ జారీ కేంద్రాలను టిటిడి ఏర్పాటు చేసింది. దీంతో, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు బుధవారం ఉదయం నుంచే పిల్లాపాపలతో సహా వేచి ఉన్నారు. బైరాగిపట్టెడ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు క్యూ లైన్‌ను తెరిచినట్లు చెబుతున్నారు. టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్లు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. అయితే, విష్ణువాసంలో తొక్కిసలాటకు కారణాలు తెలియరాలేదు. క్యూలైన్ల వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేవని భక్తులు చెబుతున్నారు. ఒత్తిడికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని సమాచారం. తొక్కిసలాట జరిగిన వెంటనే బాధితులను హుటాహుటిన అంబులెన్సుల్లో తిరుపతిలోని సిమ్స్‌, రుయా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. అక్కడ ఆరుగురు మృతి చెందారు. వారిలో రాజేశ్వరి (42), విశాఖకు చెందిన రజని (47), శాంతి (40; లావణ్య (37), అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (41), తమిళనాడు రాష్రం సేలంకు చెందిన మల్లెజ (50) ఉన్నారు.

టిటిడి యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యమే కారణం

టిటిడి యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని భక్తులు మండిపడుతున్నారు. రుయా ఆస్పత్రి ఎమర్జన్సీ ప్రాంగణం ఆర్తనాదాలతో మారుమోగింది. టిటిడి ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడు, ఇఒ శ్యామలరావు, టిటిడి జెఇఒలు గౌతమి, వీరబ్రహ్మం, ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు, టిటిడి సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్‌పి సుబ్బరాయుడు… రుయా ఆస్పత్రికి చేరుకుని చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకుల కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ వారి క్షేమ సమాచారం కోసం ఫోన్లలో ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను సిపిఎం నాయకులు కందారపు మురళి, టి.సుబ్రమణ్యం పరామర్శించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యుద్ధప్రాతిపదికన భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

 

చంద్రబాబు ఆగ్రహం

సంఘటన విషయం తెలిసిన వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారుల తీరుపై అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకనుగుణంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మృతుల సంఖ్య పెరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలపాలైన వారికి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విచారం వ్యక్తం చేశారు.

మెరుగైన వైద్య సేవలందించాలి : వైఎస్‌ జగన్‌

తిరుమల తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితులు చక్కదిద్దేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రద్దీ నియంత్రణలో వైఫల్యం

వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలను పురస్కరించుకుని తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎనిమిది టోకెన్‌ జారీ కేంద్రాల వద్ద సందర్శకులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, టోకెన్ల జారీ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు నెల రోజులుగా టిటిడి కసరత్తు చేస్తున్నా, నియంత్రణలో వైఫల్యం చెందిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్‌పి ఎల్‌.సుబ్బరాయుడు, టిటిడి చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారి శ్రీధర్‌ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రెజర్‌ పాయింట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించినా, కొందరు పోలీసుల ఓవర్‌ యాక్షన్‌ వల్ల తోపులాట చోటు చేసుకుందని తెలుస్తోంది.

➡️