త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం -రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ప్రజాశక్తి-కడప అర్బన్‌/రాయచోటి :త్వరలో ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన కుటుంబసభ్యులతో కలిసి కడప విజయదుర్గమ్మ ఆలయాన్ని శనివారం సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే మహిళలకు ఆర్‌టిసి బస్సులో ఉచిత ప్రయాణం అమలవుతుందన్నారు. దీని గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో రవాణా, యువజన, క్రీడా శాఖలలో వినూత్నమైన మార్పును తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అన్నమయ్య జిల్లా శివారు ప్రాంతమైన గువ్వలచెరువు నుంచి రాయచోటి వరకు మంత్రికి పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి.

➡️