Free Electricity: పటిష్టంగా ‘ఉచిత విద్యుత్‌’ అమలు

 విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతు సాధికారతకు దోహదపడే ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సరఫరా పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఇంధనశాఖపై సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఉచిత విద్యుత్‌ పథకాన్ని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. దెబ్బతిన్న పాతలైన్లు, పాడైన ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వాటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాలకు 100 శాతం విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ లైన్లు వేయడం సాధ్యం కాని గిరిజన ఆవాసాలకు సోలార్‌ విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెన్‌కో ఎమ్‌డి కెవిఎన్‌ చక్రధర్‌బాబు, ఇంధనశాఖ డిప్యూటీ సెక్రటరీ బిఎవిపి కుమార్‌ రెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ఎవికె భాస్కర్‌, ఎపిఇపిడిసిఎల్‌ సిఎమ్‌డి ఐ పథ్వితేజ్‌, ఎపిఎస్‌పిడిసిఎల్‌ సిఎమ్‌డి కె సంతోషరావు తదితరులు పాల్గొన్నారు.

➡️