- వక్ఫ్ చట్ట సవరణ ఉపసంహరించుకోండి
- సిపిఎం రాష్ట్ర మహాసభ తీర్మానం
ప్రజాశక్తి -సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : ముస్లిం ప్రజల సంక్షేమ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, హామీలు అమలు చేయాలని, వక్ఫ్ చట్టానికి కేంద్రం తల పెట్టిన సవరణలను ఉపసంహరించుకోవాలని, పాత చట్టాన్నే కొనసాగించాలని, వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించాలనే తీర్మానాలను ఎస్‌ఎ సుభాన్ (కర్నూలు) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రషీద్ (నెల్లూరు) బలపరిచారు. ఇటీవల ఆమోదించిన రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన నిధులు కూడా విడుదల చేయలేదని తీర్మానం పేర్కొంది. మైనారిటీల సంక్షేమం మాటల్లో తప్ప, ఆచరణలో జరుగుతున్న కృషి ఏమీలేదని తెలిపింది. మైనార్టీల సంక్షేమానికి వారి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ఖర్చు చేయాలని సిపిఎం రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది. వక్ఫ్ ఆస్తులను దురాక్రమణదారులకు అప్పజెప్పడానికి తన మతతత్వ అజెండాలో భాగంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వివరించింది. ప్రజలను మత ప్రాతిపదికన విభజించడానికి ముస్లిం ప్రజానీకాన్ని సమాజం నుంచి వేరు చేసే దురుద్దేశంతో బిజెపి ఈ సవరణలను చేయబోతోందని పేర్కొంది. బిజెపి ప్రతిపాదించిన వక్ఫ్ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ, భారత రాజ్యాంగం మైనారిటీలకు ఇచ్చిన హామీలకు భిన్నంగా ఉన్న ఈ సవరణలను తక్షణం ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది.
పొదుపుసంఘాలకు సక్రమంగా రుణాలు
పొదుపు సంఘాలకు సక్రమంగా రుణాలివ్వాలని, మహిళలకు ఉపాధి చూపాలని, మైక్రో ఫైనాన్స్, రుణీ యాప్‌ల నుండి రక్షణ కల్పించాలనే తీర్మానాన్ని బి.ప్రభావతి ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని అలివేలమ్మ (కర్నూలు) బలపరిచారు.
నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలి
నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలనే తీర్మానాన్ని పూర్ణ (పశ్చిమగోదావరి) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని వి.ఇందిర (పార్వతీపురం మన్యం) బలపరిచారు. రాష్ట్రంలో రేషన్ డిపోల్లో ఇచ్చే సరుకుల్లో ప్రభుత్వాలు క్రమంగా కోతపెట్టారని, నగదు బదిలీకి రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, కందిపప్పు, పంచదార సరఫరా అరకొరగానే ఉంది.
పామాయిల్ సరఫరా నిలిపివేశారని తీర్మానంలో వివరించారు. కోవిడ్ సమయంలో ప్రతి మనిషికీ అదనంగా ఇచ్చిన ఐదు కిలోల బియ్యం సరఫరా ఇప్పుడు నిలిపివేశారని సన్న బియ్యం ఇస్తామని వైసిపి ఊరించి మోసగించిందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో నాడు, నేడు వేల కోట్ల రూపాయలు పాలక పార్టీల నేతలు, అధికారులు దోచుకుంటున్నారని పేర్కొంది. అధిక ధరలు తగ్గించాలని, ప్రజా పంపిణీతో నిత్యావసర సరుకులు అందించాలని రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది.