అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన దృష్ట్యా అమరావతి అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై నోరు మెదపకుండా తుంపులు పెట్టి తమాషా చూసిన కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటులో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని స్పష్టంగా ప్రకటన చేసినందున ఇప్పటికైనా నాటకాలకు స్వస్తి చెప్పి అమరావతి అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఆ మేరకు ఈ సెషన్‌లోనే ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్రం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మరో ప్రకటనలో కోరారు. ఇటీవల కృష్ణా జల వివాదాన్ని పెంచడంతో సహా అన్ని విధాలా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులన్నింటికీ మద్దతునివ్వాలని తమ పార్టీ ఎంపిలను ముఖ్యమంత్రి ఆదేశించడం సరైంది కాదని పేర్కొన్నారు. సిఎం నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టకరమని తెలిపారు. వైసిపి, టిడిపి తరపున రాష్ట్రం నుండి ఎన్నికైన ఎంపిలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి, కరువు సహాయానికి నిధులు రాబట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు నష్టం చేసే స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు షరతుతో సహా విద్యుత్‌ సంస్కరణల బిల్లును తిరస్కరించాలని కోరారు.

రాజధానిని విశాఖకు తరలించే యత్నాలను విరమించాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేసినందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును మానుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

➡️