ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి మృతి

  • ఎన్నారై ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం ఉండవల్లికి చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి (78) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఆయన నదిలో ఉండగానే గుండెపోటుకు గురయ్యారు. సహచరులు గమనించి మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య శివలీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాటక రచయిత, దర్శకుడు, నటుడు సుబ్బారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌ బాబూరావు, డి.రమాదేవి, ఎంబివికె ట్రస్ట్‌ చైర్మన్‌ పి.మధు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఇతర నాయకులు, ప్రజానాట్య మండలి కళాకారులు, నాయకులు, వివిధ పార్టీల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. భౌతికకాయంపై ప్రజానాట్య మండలి జెండాను కప్పారు. ఆయన భౌతికకాయాన్ని వైద్య పరిశోధనల కోసం మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి అప్పగించారు. కళ్లను హైదరాబాద్‌ ఎల్‌విఆర్‌ కంటి ఆస్పత్రికి అందించారు. సాయంత్రం నిర్వహించిన సంతాప సభకు ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన వహించగా పి.మధు, వై.వెంకటేశ్వరరావు, ఎంవివికె కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ తదితరులు మాట్లాడారు. సుబ్బారెడ్డి.. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో చదివేటప్పుడు ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశారు. అనంతరం అనేక ఆటుపోట్లను, పెత్తందార్ల దాడులను ఎదుర్కొని ఉద్యమంలో కొనసాగారు. 1980 ప్రాంతాల్లో కృష్ణాజిల్లా ఉయ్యూరు, చల్లపల్లి, దివి డివిజన్‌లో సిపిఎం కార్యదర్శిగా పనిచేశారు. జాషువా సాంస్కృతిక వేదిక ప్రారంభ కన్వీనర్‌గానూ విజయవాడ కేంద్రంగా పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలు, సుందరయ్య కళాజాతా, వేమన విజ్ఞాన జాతా, సారా వ్యతిరేక ఉద్యమం, అక్షర కళాయాత్రలు ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ప్రజానాట్య మండలిలో 40 ఏళ్ల ప్రయాణంలో 200 మంది కళాకారులను సిపిఎం సభ్యులుగా తీర్చిదిద్దారు. యువజన సంఘాల్లోనూ పని చేశారు. సుబ్బారెడ్డి మృతికి ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు వై. కేశవరావు సంతాపం తెలిపారు. రైతు సంఘంలో 15 ఏళ్లు ఉన్నారని, రాష్ట్ర కమిటీలో సభ్యులుగా పనిచేశారని వారు గుర్తు చేశారు. సుబ్బారెడ్డి మృతికి సాహితీస్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

➡️