- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ఓపెన్ జైళ్ల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నాలుగు వారాల్లోగా అందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. సెమీ-ఓపెన్ లేదా ఓపెన్ జైళ్లు అనేవి ఖైదీలు జీవనోపాధిని సంపాదించడానికి పగటిపూట ప్రాంగణం వెలుపల పనిచేసి సాయంత్రం తిరిగి రావడానికి ఖైదీలను అనుమతిస్తాయి. ఖైదీలు సమాజంతో కలిసిపోవడానికి, బయట సాధారణ జీవితాలను గడపడానికి, ఖైదీలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఓపెన్, సెమీ-ఓపెన్ జైళ్లను ప్రవేశపెట్టారు. జైళ్లలో రద్దీకి సంబంధించిన సమస్యల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జులై 15న విచారణలో కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, పుదుచ్చేరి, లడఖ్ వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంకా తమ స్పందన తెలియజేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. మే 9న విచారణ సందర్భంగా ఖైదీల పునరావాస సమస్యను కూడా పరిష్కరించేందుకు ఓపెన్ జైళ్లను ఏర్పాటు చేయడం ఒక పరిష్కారమని సుప్రీం కోర్టు పేర్కొంది.