స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో ఒప్పందాలు వద్దు : ఎపి రైతు సంఘం
ప్రజాశక్తి – యంత్రాంగం : ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం భారతదేశ పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్ పర్యటనను నిరసిస్తూ ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో ఒప్పందాలు వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు సుందరయ్య సర్కిల్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో వ్యవసాయ, పాడి, మత్స్య రంగాల్లో అసమాన ఒప్పందాలు వద్దని, అమెరికాతో అన్ని అసమాన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల చర్చల నుంచి వైదొలగాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ పాల్గొన్నారు. నంద్యాలలోని తిక్కస్వామి సెంటర్ వద్ద ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియుల ఆధ్వర్యంలో రైతులు, కూలీలు, కార్మికులు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు, ఆత్మకూరు, పాములపాడులోనూ ఆందోళనలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ తమ్మయ్యపేటలో పాడి రైతులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ‘వాన్స్ గో బ్యాక్, భారతదేశం అమ్మకానికి లేదు’ అని నినాదాలు చేశారు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో అసమాన ఒప్పందాలు వద్దని ఎపి రైతుసంఘం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతుసంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో ఆందోళనలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. జీలుగుమిల్లిలో వాన్స్ గోబ్యాక్ అంటూ స్థానిక ప్రజాసంఘాల కార్యాలయ సమీపంలో నిరసన తెలిపారు.
