- విద్యుదాఘాతంతో ఇద్దరు గిరిజనులు దుర్మరణం
ప్రజాశక్తి- దగదర్తి (నెల్లూరు జిల్లా) : సహాయం చేసేందుకు వెళ్లిన ఇద్దరు గిరిజనులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… తడకలూరుకు చెందిన మనోహర్, మహలక్ష్మమ్మ గేదెలకు పచ్చిగడ్డి కోసం ఆటోలో తలమంచి మేజర్ కాలువపై వెళ్తున్నారు. వారి ఆటో ప్రమాదానికి లోనైంది. ఆటో బోల్తా పడుతున్న సమయంలో వీరిద్దరూ దాని నుంచి బయటకు దూకేయడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పొలాల్లో బోల్తా పడిన ఆటోను పైకి తీసుకొచ్చేందుకు స్థానిక గిరిజనుల సాయాన్ని వారు కోరారు. వారికి సాయం చేసేందుకు వెళ్లిన దాసరి పోలయ్య (46), మాణికుల నరసయ్య (21) పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. పోలయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. నరసయ్య అవివాహితుడు. దగదర్తి ఎస్‌ఐ జంపాని కుమార్, ట్రాన్స్‌కో ఎఇ దస్తగిరి సంఘటనా చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.