- ఎపి మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మునిసిపల్ కార్మికుల 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాల అమలుకు జీఓలు జారీ చేయాలని ఎపి మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఅండ్ డిఎంఎ పి.సంపత్ కుమార్‌ను వడ్డేశ్వరంలోని డైరక్టరేట్‌లో ఫెడరేషన్ నాయకులు శుక్రవారం కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మునిసిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు జీఓఎంఎస్ నెంబరు 36 తేదీ 01.03.2024 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్టు వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ -1970 ప్రకారం శాశ్వత స్వభావం కలిగి ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న మునిసిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. వాహనాల మరమ్మతుల భారాన్ని కార్మికులపై నెట్టవేసే ధోరణి మారాలని, డిపార్టుమెంట్ ద్వారా వాహనాల మరమ్మతుల చేయించాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు అదనపు పనులు కేటాయించిన సమయాల్లో తప్పనిసరిగా టిఎ, డిఎలు చెల్లించాలన్నారు. సిటీ బస్ సర్వీసులు ఉన్న ప్రతి పట్టణంలో పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బి.ముత్యాలరావు, కోశాధికారి ఎస్ జ్యోతిబసుల నేతృత్వంలోని ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేశారు.