‘గోదావరి’ మళ్లీ ఉగ్రరూపం

  • భద్రాచలం వద్ద 3వ, ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ
  • మరింత ముంపులోకి పోలవరం విలీన మండలాల్లోని గ్రామాలు
  • పునరావాస కేంద్రాలకు, ఎత్తైన ప్రాంతాలకు తరలిపోతున్న వరద బాధితులు
  • ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు నిల్చిన రాకపోకలు

ప్రజాశక్తి- యంత్రాంగం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా తగ్గినట్లే తగ్గి శనివారం మరోసారి పోటెత్తింది. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతుండడంతో పోలవరం విలీన మండలాలు మరింత ముంపునకు గురవుతున్నాయి. దీంతో, ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరద మరింత పెరగవచ్చనే అధికారుల హెచ్చరికలతో కొందరు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మరికొందరు కొండలు, గుట్టలు, ఎతైన ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని తలదాచుకుంటున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 54 అడుగులు దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 14.20 అడుగులకు చేరుకుంది. దీంతో, మళ్లీ ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 175 గేట్లనుపైకి లేపి 13,46,507 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వలకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 33.400 మీటర్లకు చేరింది. దీంతో, 11.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో ఏలూరు జిల్లాలోని విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రధాన రహదారులపైకి నీరు చేరింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు-భద్రాచలం ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం వెళ్లే బస్సులను నిలిపివేశారు. వరద నీరు చుట్టుముట్టడంతో కుక్కునూరు మండలం ఎల్లప్పగూడెం, బాపన్నగూడెం, బెస్తగూడెం ఎస్‌సి కాలనీ ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. పునరావాస కేంద్రాల్లోని వారికి, వరద ప్రభావంతో కొండలు, గుట్టలపైకి చేరిన వారికి సాయం అందడంలో కొంత అలసత్వం జరుగుతుండడంతో బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చింతూరులో ఉంటూ పర్యవేక్షిస్తున్న అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌
అల్లూరి జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు మరింత ముంపులోకి చేరుకున్నాయి. దీంతో, మరిన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై పలుచోట్ల వరద నీరు చేరడంతో భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలం రాయనపేట, నెల్లిపాక, నందిగామ, మురుమూరు, చెన్నంపేట రహదారులపై నీరు అధికంగా చేరింది. డొంకరాయి జలాశయం నుంచి నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 39 అడుగులకు చేరుకుంది. ఆ మండలంలో పలు గ్రామాలు ముంపు పెరుగుతోంది. జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ చింతూరులోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. విఆర్‌.పురం మండలం ఒడ్డుగూడెం వద్ద శబరి, గోదావరి కలిసే చోట వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. మరో మూడు అడుగులు వరద పెరిగితే ఎత్తున ఉండే విఆర్‌.పురం, రాజపేట, మొద్దులగూడెం, అన్నవరం గ్రామాలు కూడా మునిగే అవకాశముందని అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే తమను పునరావాస కేంద్రాలకు తరలించి నిత్యావసర సరుకులు, బరకాలు, కిరోసిన్‌, దోమతెరలు వంటివి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. కూనవరం మండలం కూనవరం, టేకులబోరు కొండ్రాజుపేట, శబరి కొత్తగూడెం, టేకుబాక గ్రామాలు నేటికీ ముంపులోనే ఉన్నాయి.

లంకలను ముంచెత్తుతున్న వరద
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని లంకలను వరద నీరు ముంచెత్తుతోంది. లంకల్లోని ఆవాసప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో, వారికి కంటిమీద కునుకు లేకుండా ఉంది. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో 80 ఇళ్లను వరద ముంచెత్తింది. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంక ఆఫ్‌ ఠానేలంక, కూనలంక, చింతల్లంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, పి.గన్నవరం మండలం శివాయలంక, చినకందపపాలెంలో ఇళ్ల చుట్టూ నడుంలోతు నీరు చేరింది. ఆలమూరు మండలంలో బడుగువానిలంక, తోకలంక అయినవిల్లి మండలంలో పల్లపులంక, అయినవిల్లిలంక, శానిపల్లిలంక, పొట్టిలంకల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. రామచంద్రపురం మండలం కోటిపల్లిలంక పూర్తిగా ముంపునకు గురవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కపిలేశ్వరపురం మండలం నారాయణలంక, కేదార్లంక, కోరుమిల్లి, అద్దంకివారి లంకల్లోని పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో బాలబాలాజీ ఆలయనికి వెళ్లే రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో, ఆలయాన్ని మూసేశారు. వరద నీటి ప్రవాహానికి అప్పనపల్లి పాటురేవు ప్రాంత చెరువుల్లోని మత్స్యసంపద కొట్టుకుపోయింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, యలమంచిలి మండలాల్లోని పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నీట మునగడంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కోనసీమ జిల్లా లంకల్లోని పంటలన్నీ కొట్టుకుపోయాయి. సుమారు ఆరు వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పువ్వులు, తమలపాకుల పంటలకు నష్టం వాటిల్లింది. గోదావరి లంకల్లోని కొబ్బరి తోటల్లోకి వరద నీరు చేరింది. అక్కడ కొబ్బరికాయలను తరలించేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పశుగ్రాసం లేక పశువులు అల్లాడుతున్నారు. దీంతో పశువులను పడవలపై తరలిస్తున్నారు.

భద్రాచలాన్ని మూడు వైపులా చుట్టుముట్టిన వరద
భద్రాచలం పట్టణాన్ని మూడు వైపులా చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతంలోని మేడిగడ్డ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరదకు తాలిపేరు, కిన్నెరసాని, జంపన వాగుల ఉధృతి కూడా తోడైంది.

శీశైలానికి పోటెత్తుతున్న వరద
కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ జూరాల నుండి 3,12,544 క్యూసెక్కులు, సుంకేసుల (తుంగభద్ర) నుంచి 99,736 క్యూసెక్కులు వస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి మొత్తం 4,12,280 క్యూసెక్కులు వస్తుండడంతో జలాశయ నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 866.40 అడుగులకు చేరింది. మన రాష్ట్రం పరిధిలోని కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 12,779 క్యూసెక్కుల నీటితో 6.9085 మిలియన్‌ యూనిట్లు, తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో 36,279 క్యూసెక్కుల నీటితో 18.087 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాల ద్వారా విద్యుదుత్పాదన అనంతరం దిగువ సాగరకు 48,958 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి :విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
1,08,085 ఎకరాల్లో అగ్రికల్చర్‌, 6,821 ఎకరాల్లో హార్టికల్చర్‌ పంటలకు నష్టం
సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అంచనాల ప్రకారం మరో మూడు రోజులు గోదావరికి వరద ప్రవాహం కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. రాష్ట్ర కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యల్లో మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఆరు ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నట్లు తెలిపారు. అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 21,051 మందిని ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. 13,289 మందిని 82 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. 273 మెడికల్‌ క్యాంపులు నిర్వహించామని, 3,126 ఆహార ప్యాకెట్లు, 2.86 లక్షల వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణ, వివిధ ప్రాజెక్టులు, నదుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లాల్లోని 96 మండలాల్లో 525 గ్రామాలు వరదలకు ప్రభావితమయ్యాయని తెలిపారు. ప్రాథమిక నివేదికల ఆధారంగా 1,08,085 ఎకరాల్లో అగ్రికల్చర్‌, 6,821 ఎకరాల్లో హార్టికల్చర్‌ పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

➡️