వైసిపికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్‌బై

Jan 6,2024 10:41 #ycp mla

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపికి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపిని వీడగా.. శుక్రవారం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు. రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు. సిఎం జగన్‌ వారిని కలవకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సర్వేల ఆధారంగా మీకు టికెట్‌ ఇవ్వడం లేదని చెప్పించడంతో రామచంద్రారెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చి సిఎం నివాసానికి నమస్కారం చేస్తూ వైసిపిని వీడుతున్నట్లు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. టికెట్‌ ఇవ్వటం లేదని సజ్జలతో చెప్పారని అన్నారు. జగన్‌ను నమ్ముకుని కాంగ్రెస్‌ నుంచి వచ్చానని తెలిపారు. 2014, 2019లో పోటీ చేయనని చెప్పినా మంత్రి పదవి ఇస్తామని చెప్పి పోటీ చేయించారని అన్నారు. వైసిపి కోసం గడప గడపకూ తిరగడమే కాదు జగన్‌ చెప్పిన ప్రతి పని చేశామన్నారు. సర్వేల పేరుతో టికెట్‌ ఇవ్వలేమనడం బాధగా వుందన్నారు. కల్యాణదుర్గం నుంచి తను పోటీ చేయడంతోపాటు తన భార్య కూడా రాయదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని అన్నారు. వైసిపిలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇవాళ్టి వరకు జగనే మా సర్వస్వం అనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలు సర్వనాశనం అయ్యాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇప్పటి వరకూ ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని, వస్తే పరిశీలిస్తానని తెలిపారు. పోటీ చేయడం మాత్రం జరుగుతుందన్నారు.

➡️