గోపిమూర్తి ఘన విజయం

  • మొదటి ప్రాధాన్యతా ఓట్లతోనే గెలుపు
  • 9,165 ఓట్లను సాధించిన పిడిఎఫ్‌ అభ్యర్థి
  • సమీప ప్రత్యర్థి నారాయణరావుపై 3,906 ఓట్ల మెజారిటీ
  • అన్ని రౌండ్లలోనూ కొనసాగిన ఆధిక్యత

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయులు మరోసారి ఉద్యమ నేతకు పట్టం కట్టారు. పిడిఎఫ్‌ అభ్యర్థి బొర్రా గోపిమూర్తికి ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం కాకినాడ జెఎన్‌టియు ప్రాంగణంలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ లైబ్రరీ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎన్నికల పరిశీలకులు కె.హర్షవర్దన్‌, రిటర్నింగ్‌ అధికారి, కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ ఎన్నికలో మొత్తం ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 16,737 మంది ఓటర్లకుగానూ 15,494 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 814 ఓట్లు చెల్లనివిగా అధికారులు ధ్రువీకరించారు. మిగిలిన 14,680 వ్యాలిడ్‌ ఓట్లలో విజయానికి అవసరమైన కోటా ఓట్ల సంఖ్య 7,341గా నిర్దారించారు. గోపిమూర్తికి తొలి రౌండ్‌లోనే 9,165 ఓట్లు వచ్చాయి. ప్రధాన ప్రత్యర్థి గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు పోలయ్యాయి. పులుగు దీపక్‌కు 102, నామన వెంకటలక్ష్మికి 81, కవల నాగేశ్వరరావుకు 73 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లోనే కోటాకు మించి ఓట్లు రావడంతో బొర్రా గోపిమూర్తి ఎంఎల్‌సిగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి ప్రకటించి ధ్రువపత్రాన్ని అందించారు. సమీప ప్రత్యర్థి నారాయణరావుపై 3,906 ఓట్ల మెజారిటీని గోపిమూర్తి సాధించారు.

ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై గళం విప్పుతా : మీడియాతో గోపిమూర్తి

ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై శాసనమండలిలో గళం విప్పుతానని ఎంఎల్‌సి బొర్రా గోపిమూర్తి తెలిపారు. సోమవారం ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిన అనంతరం ఆయన కాకినాడ జెఎన్‌టియుకె ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కి డబ్బులు పంచి, ప్రలోభలకు గురిచేసి గెలుపు కోసం కొందరు కార్పొరేట్‌ వ్యక్తులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారన్నారు. మెజారిటీ ఉపాధ్యాయులు, అధ్యాపకులు నిజాయితీ వైపే నిలిచి తనకు ఈ విజయాన్ని కట్టబెట్టారని పేర్కొన్నారు. భారీ మెజారిటీని అందించి ప్రజాస్వామ్య విలువలను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు..ఇప్పటికే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాల్లో పాల్గొన్నానని, భవిష్యత్తులో తనకు అప్పగించిన బాధ్యతతో సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానని అన్నారు.

విజయోత్సవ ర్యాలీ

ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, పలువురు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, యుటిఎఫ్‌ నాయకులు జెఎన్‌టియుకె వద్దకు చేరుకున్నారు. పూలమాలలతో గోపిమూర్తికి ఘనంగా స్వాగతం పలికారు. జెఎన్‌టియుకె నుంచి భానుగుడి, కలెక్టరేట్‌ మీదుగా బైక్‌ ర్యాలీతో యుటిఎఫ్‌ హోమ్‌కు చేరుకున్నారు. పిడిఎఫ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఇది అందరి విజయం : విజయోత్సవ సభలో వక్తలు

గోపిమూర్తి విజయం అందరి విజయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ యుటిఎఫ్‌ హోమ్‌లో విజయోత్సవ సభ యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అన్నారం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోపిమూర్తి విజయం కోసం యుటిఎఫ్‌తోపాటు అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పని చేశాయన్నారు. యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ ఈ విజయంతో ఉపాధ్యాయుల నిజాయితీ మరోమారు రుజువైందని పేర్కొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు మాణిక్యం మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు నిరంతరం పనిచేస్తున్నారన్నారు యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ గోపిమూర్తి విజయంతో యుటిఎఫ్‌కి మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. గోపిమూర్తి మాట్లాడుతూ ప్రత్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినప్పటికీ మెజారిటీ ఓటర్లు తన వైపు నిలబడి భారీ విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తొలుత అమరజీవి చెన్నుపాటి లక్ష్మయ్య వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంఎల్‌సిలు, యుటిఎఫ్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

➡️