21న 9:46 నిమిషాలకు అసెంబ్లీ..

  • ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి!
  • చీఫ్‌ మార్షల్‌గా గణేష్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ తొలి సమావేశాలు 21వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 గంటలకు సభ ప్రారంభమవుతుందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. తొలిరోజు అసెంబ్లీ కార్యదర్శి రామాచార్యులు ప్రొటెం స్పీకరు ఎన్నికలను ప్రకటిస్తారు. ఇప్పటికే ఏడుసార్లు సభ్యుడిగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రోటెం స్పీకరుగా వ్యవహరించాలని అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ కోరారు. దీనికి బుచ్చయ్య చౌదరి అంగీకరించారు. తొలిరోజు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం స్పీకరు ఎన్నికల, అభినందనలు ఉండనున్నాయి. వరుసగా గవర్నర్‌ ప్రసంగం, దానికి ధన్యవాదాలు తెలిపే సభ జరగనున్నాయి. మొత్తంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.

చీఫ్‌ మార్షల్‌ మార్పు
అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌గా గణేష్‌ను నియమించారు. ఇప్పటి వరకూ ఆయన ఆక్టోపస్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం మార్షల్‌గా ఉన్న మాలకొండారెడ్డిని వెంటనే విధుల నుండి రిలీవ్‌ చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

➡️