పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కుట్ర

Apr 4,2024 20:18 #Nara Bhuvaneshwari, #TDP
  •  వైసిపి తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు : భువనేశ్వరి

ప్రజాశక్తి-కడప అర్బన్‌/ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌ : వైసిపి చేసే ప్రతి తప్పునూ చంద్రబాబునాయుడుపై నెట్టేసి చేతులు దులుపుకుంటుందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా చంద్రబాబుకు ఆపాదిస్తున్నారని, వృద్ధులను మంచాలపై ఎండలో తీసుకెళ్లి వాళ్ల ప్రాణాలను వైసిపి నాయకులు, కార్యకర్తలు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపించే చంద్రబాబు.. పింఛన్లను ఎలా అడ్డుకుంటారని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం కడప, ప్రొద్దుటూరులో ఆమె పర్యటించారు. వరద చెండ్రాయుడు, కూరపాట రాధ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యకర్తలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, పైగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని విమర్శించారు. టిడిపి కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం వైసిపి పాలనలో అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాక్షస పాలనలో తాను ధైర్యంగా ఇలా మీ వద్దకు వచ్చానంటే మీరున్నారనే నమ్మకమేనని చెప్పారు. భువనేశ్వరి వెంట టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, కడప, ప్రొద్దుటూరు టిడిపి అభ్యర్థులు మాధవి, నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

➡️