ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : మాజీ సిఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై అనుమానం ఉందని, ఆయన పర్యటనకు తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ బీచ్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ భద్రతపై ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, ఈ విషయమై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. ప్రధానిని, కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసి జగన్‌కు సరైన భద్రత కల్పించాలని కోరుతామన్నారు. రాప్తాడు పర్యటన ఒక్కటే కాకుండా గుంటూరు మిర్చియార్డు, నంద్యాలలోని మహానంది పర్యటనలో కూడా జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కృష్ణదేవరాయలు ఒక ఎంపి స్థాయిలో ఉండి మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రొఫెషనల్ కిల్లర్ అని సంబోధించారని, విద్యా సంస్థను నడిపే వ్యక్తి ఇలా సంస్కారహీనంగా మాట్లాడడం సరికాదన్నారు. నాయకులపై దుర్భాషలాడడం పోలీసులకు ఫ్యాషన్ అయిపోయిందని, అలా మాట్లాడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటే ఆ తరహా ఘటనలు పునరావృతం కావని తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం పాలన చేయకుంటే శ్రీలంక, బెంగాల్ తరహా ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు.
