- చంద్రబాబే మొదటి ముద్దాయి : వైఎస్ జగన్
ప్రజాశక్తి – తిరుపతి సిటీ : వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే మొదటి ముద్దాయని చెప్పారు. ‘పదవ తేదీ వైకుంఠ ఏకాదశి. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు జరుగుతున్నా హడావిడిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారు.’ అని చెప్పారు. ఆరవ తేది నుండి 8వ తేది మధ్యాహ్నం వరకు చంద్రబాబు కుప్పంలోనే ఉన్నారని, దీంతో అధికారులంతా బాబు వెంటే ఉన్నారని అన్నారు. దాదాపు 2వేల మంది పోలీసులు చంద్రబాబు బందోబస్తులో ఉన్నారని, తెలిపారు. ఎనిమిదవ తేది సాయంత్రం నుండే తిరుపతిలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగిందని చెప్పారు. దీంతో చాలినంత సిబ్బంది లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పోలీసు అధికారులు ఆ పని చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా లడ్డు వివాదాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి టిటిడి ప్రతిష్టను దిగజార్చడానికి సిద్ధపడ్డారని చెప్పారు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటను గుర్తుచేశారు. అనేక దశబ్దాలుగా వస్తున్న వైకుంఠ ఏకాదశి గురించి తెలిసి కూడా ఇఒ, అడిషనల్ ఇఒ, కలెక్టర్, ఎస్‌పి, టిటిడి చైర్మన్ పటిష్ట చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం కల్పించాలని, గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించి, డిశార్చి సమయంలో ఒక్కోక్కరికి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అన్నారు. ఘటనకు కారణమైన అధికారులను, చైర్మన్‌ను తక్షణమే తొలగించాలని డిమాండు చేశారు.
జగన్ పర్యటనలో ఉద్రిక్తత
జగన్ పర్యటనలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ ఆస్పత్రికి వస్తున్న సమయంలోనే డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్నారు. దీంతో జగన్ కాన్వారును నిలిపివేసే ప్రయత్నాన్ని పోలీసు అధికారులు చేశారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో వైసిపి నేతలే ట్రాఫిక్‌ను మళ్లించి, జగన్ వాహనాలకు దారి ఇచ్చారు. ఈ పరిణామంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి వాహనం దిగి కాలినడకన ఆస్పత్రికి బయలుదేరారు. ఆయన్ను భారీ సంఖ్యలో వైసిపి కార్యకర్తలు అనుసరించారు. కొంత దూరం నడిచిన తరువాత మరో కారు ఎక్కి ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికి పవన్‌కల్యాణ్ అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే, జగన్ వస్తున్న విషయం తెలియడంతో కొందరు క్షతగాత్రులను ఆస్పత్రి నుండి తరలించారని వైసిపి వర్గాలు ఆరోపించాయి.