- ఇందుకోసం ఉపాధ్యాయులందరూ పోరాడాలి
- పిఆర్‌సి కమిషనర్‌ను వెంటనే నియమించాలి
- ప్రాంతీయ సదస్సులో యుటిఎఫ్ నాయకులు
- యుటిఎఫ్ కర్నూలు జిల్లా కార్యాలయం ప్రారంభం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : ప్రభుత్వ బడిని కాపాడుకోవాలని, అందుకు ఉపాధ్యాయులందరూ పోరాడాలని, పిఆర్‌సి కమిషనర్‌ను వెంటనే నియమించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ కోరారు. యుటిఎఫ్ కర్నూలు జిల్లా ప్రారంభోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా సి క్యాంప్ సెంటర్ నుంచి యుటిఎఫ్ భవన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనరతరం యుటిఎఫ్ పతాకాన్ని వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. జిల్లా కార్యాలయాన్ని ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె సురేష్ కుమార్ అధ్యక్షతన విద్యా రంగ సవాళ్లు- కర్తవ్యాలుపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలకవర్గ ప్రయోజనాల కోసమే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఉపాధ్యాయులంటే పాఠాలు చెప్పేవారు కాకుండా ఇతర పనులు చేసే వారిగా మార్చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే జిఒ 117 రద్దు చేస్తామని పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని, దాన్ని రద్దు చేయకుండా ప్రత్యామ్నాయం కోసం కసరత్తు చేస్తున్నారని తెలిపారు. 2018లో 38 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ఉంటే ఈ ఏడాదికి ఆ సంఖ్య 32.61 లక్షలకు తగ్గిందన్నారు. పాఠశాలలు, విద్యార్థులు లేకుండా ఉపాధ్యాయులు ఉండరని, పిల్లల హక్కుల మీద ఉపాధ్యాయుల హక్కులు ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ బడిని కాపాడుకుంటేనే నైతిక, రాజ్యాంగ విలువలుంటాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా సాల్ట్, ఎన్‌ఇపి తీసుకొచ్చారని అన్నారు. సంస్కరణలు ప్రయివేటీకరణను పెంచుతాయని, అవి జరగకుండా కాపాడుకోవాలని తెలిపారు. సమాంతర మీడియంను కొనసాగించాలని, ప్రతి పంచాయతీలో ఐదు తరగతులు, ఐదుగురు ఉపాధ్యాయులతో మోడల్ ప్రయిమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, అందులో ఏ పాఠశాలనూ మ్యాప్ చేయకూడదని డిమాండ్ చేశారు. విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా ఉండాలని, లేకుంటే తల్లిదండ్రులతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
పిఆర్‌సి, ఆర్థిక బకాయిల సాధన – కర్తవ్యాలపై ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో 20 శాతం మందికే అన్ని ప్రయోజనాలూ అందుతున్నాయన్నారు. 2022లో నష్టదాయకమైన రివర్స్ పిఆర్‌సి చేశారని, ఆశించిన ప్రయోజనాలు రాకుండా ప్రతి దానిలో కోత పెట్టారని చెప్పారు. ఆ అసంతృప్తితోనే ఆ పార్టీని ఓడించారన్నారు. బకాయిలన్ని ఇచ్చాకే పిఆర్‌సి వేస్తే బాగుంటుందని నాయకులు చెబుతున్నారని, ఇప్పుడు పిఆర్‌సి కమిషన్ వేస్తే అది అందేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని తెలిపారు. వెంటనే 12వ పిఆర్‌సి కమిషనర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కావాలంటే 29 శాతం ఫిట్‌మెంట్ కావాలని, అందుకోసం 29 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు జయచంద్రారెడ్డి, లక్ష్మిరాజ, కర్నూలు జిల్లా అధ్యక్షులు యుఆర్‌ఎ రవి కుమార్, ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి, రాష్ట్ర పూర్వ గౌరవాధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎంవి రమణయ్య, సుబ్బారెడ్డి, పూర్వ సహాధ్యక్షులు నాగమణి, పూర్వ కార్యదర్శి కోటేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.