ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్‌టిసి ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వ్యక్తులు కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు కోరారు. విజయవాడలోని ఆర్‌టిసి హౌస్‌లో సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను కొనకళ్ల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేసే సందర్భంలో సంస్థకు కలిగే నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలని కోరారు. ఇదే సమయంలో ఆటో కార్మికులకు ఉపాధి తగ్గే అవకాశం ఉన్నందున వారిపై భారాలను తగ్గించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆర్‌టిసి ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. భవిష్యత్తులో ఈ అంశంపై అన్ని సంఘాలతో చర్చించి సరైన రీతిలో నిర్ణయాలు తీసుకుంటామని హామీనిచ్చిట్లు తెలిపారు. ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్, ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జిలాని, రాష్ట్ర నాయకులు దొర తదితరులు కొనకళ్లను కలిసిన వారిలో ఉన్నారు.