మచిలీపట్నం ఆంధ్ర జాతీయ విద్యాపరిషత్‌ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

  • ముఖ్యమంత్రికి వి. శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ విద్యా పరిసత్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని, అక్కడ జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన శనివారం లేఖ రాశారు. జాతీయ స్ఫూర్తితో స్వదేశీ విద్యకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలనే సదాశయంతో స్వాతంత్య్ర సమరయోధులు కొంతమంది ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్‌ను, అనుబంధ విద్యాసంస్థలను స్థాపించారని తెలిపారు. దీనికి 365 ఎకరాల విలువైన భూమి, భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఈ విద్యాసంస్థలు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారాయని తెలిపారు. వీటికి ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌గా కొనసాగుతున్న కోపల్లె హనుమంతరావు కేంద్ర బిందువుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. అతను పోలీసుశాఖలో పనిచేస్తూ ఈ విద్యాసంస్థలకు వారసుడిగా కూడా చలామణి అవుతున్నారని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు రూపొందించిన మెమోరాండం ఆఫ్‌ ఆర్టికల్స్‌లో వ్యవస్థాపక కుటుంబ సభ్యులకు వారసత్వ హక్కులు ఉండవని పేర్కొన్నప్పటికీ అక్రమంగా ఆయన కొనసాగుతున్నారని తెలుస్తోందని తెలిపారు. దీనిపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకోవాలని కోరారు. ఎజె కళాశాలలో టీచింగ్‌ స్టాఫ్‌ నియామకంలో రోస్టర్‌ పాయింట్లు నిర్ణయించకపోవడంపై విలిజెన్స్‌ దర్యాప్తు జరిగిందని తెలిపారు. దానికి సంబంధించిన నివేదిక ఇంతవరకు వెలువడలేదని పేర్కొన్నారు. ఎయిడెడ్‌ బిఇడిని ఆన్‌ ఎయిడెడ్‌ బిఇడిగా మార్చారని పేర్కొన్నారు. యుజిసి వారికి తెలియజేయకపోవడంతో వచ్చిన గ్రాంటును నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని తెలిపారు. స్టాఫ్‌కు ఇచ్చే జీతాలు ఇష్టానుసారంగా తగ్గించి వేశారని పేర్కొన్నారు. ఇంకా అనేక ఆరోపణలు వస్తున్నాయని వివరించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ విద్యాసంస్థను స్వాధీనం చేసుకుని కొత్త కోర్సులను ప్రవేశపెట్టి కృష్ణాజిల్లాలో పేద విద్యార్థులకు ఉచిత విద్యనుందించడానికి కృషి చేయాలని శ్రీనివాసరావు కోరారు.

➡️