రామతీర్థం కేసులో నిందితుడికి ప్రభుత్వ సాయమా?

  • బిజెపి, సనాతనవాది పవన్‌కల్యాణ్‌ దీన్ని ఎలా సమర్థిస్తున్నారు?
  • స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ మతలబు ప్రయివేటీకరణ : బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రామతీర్థం కేసులోని నిందితుడికి ప్రభుత్వం ఎందుకు సాయం చేసిందని వైసిపి నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిందితుడికి సాక్షాత్తూ అదే ఆలయ ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు సిఎం సహాయ నిధి నుంచి రూ. ఐదు లక్షలు అందజేశారని తెలిపారు. ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారని చెప్పారు. ఆ సంఘటన జరిగినప్పుడు దేవుడు మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన టిడిపి నాయకులు నానా హంగామా చేసి.. అదే కేసులో నిందితుడికి సాయం చేయడం చూస్తుంటే.. ఆ పాపంలో వారి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రాజకీయంగా టిడిపికి మేలు చేసినందుకు నిందితుడికి బహుమానంగా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒకవేళ అదే జరిగితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఘాటు విమర్శలు చేశారు. ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్‌ కల్యాణ్‌, హిందూ మతానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం చేసుకునే బిజెపి నాయకులు ఏం చేస్తున్నారని?. వారెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ, ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని, కానీ ప్యాకేజీ పేరుతో స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారని బొత్స విమర్శించారు. అందుకే ప్రయివేటీకరణ ఆగిపోతుందని ఏ ఒక్కరూ చెప్పడం లేదన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని, కేంద్ర హోంమంత్రితో ఆ మాట చెప్పించకపోవడం వెనుక మతలబు చేయడమేనని స్పష్టంగా తెలుస్తోందన్నారు. టిడిపి కూటమి నాయకుల అబద్ధపు హామీలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారని బొత్స పేర్కొన్నారు.

➡️