ప్రజాశక్తి-అమరావతి : కాకినాడ పోర్టులో పారా బాయిల్డ్ రైస్‌ను ఓ నౌకలో లోడ్ చేసేందుకు అనుమతించాలంటూ దాఖలైన మూడు పిటిషన్లను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. ఇందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. గురువారం అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వాదిస్తూ, పారా బాయిల్డ్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు పిటిషనర్లకు అన్ని అనుమతులూ ఉన్నాయని చెప్పారు. అక్రమ రవాణా చేస్తున్న 1,320 మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యాన్ని స్టెల్లా నౌక నుంచి అన్లోడ్ చేస్తున్నామని, ప్రక్రియ ముగిసిన అనంతరం పిటిషనర్లకు చెందిన పారా బాయిల్డ్ రైస్ నౌకలో లోడ్ చేసుకోవచ్చు తెలిపారు. తొలుత పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీనివాసరెడ్డి వాదిస్తూ, అధికారులతో చర్చల తర్వాత నౌకలో బియ్యాన్ని లోడ్ చేసేందుకు అనుమతినిచ్చారని, పిటిషన్లను వాపస్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు అనుమతినిస్తూ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఆదేశాలు జారీ చేశారు. నౌకలో బియ్యాన్ని లోడ్ చేయకుండా అడ్డుకునే అధికారం రాష్ట్రానికి ఎక్కడ ఉందో చెప్పాలని గత విచారణలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే.
