GPS: జిపిఎస్‌ గెజిట్‌ రద్దు చేయండి

యుటిఎఫ్‌ అధ్యక్షులు వెంకటేశ్వర్లు డిమాండ్‌
ఉత్తర్వుల ప్రతుల దగ్ధం
ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో : కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సిపిఎస్‌) ఉద్యోగులను గ్యారంటీ పెన్షన్‌స్కీం(జిపిఎస్‌)లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ స్కీం(ఓపిఎస్‌) అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిపిఎస్‌ అమలుకై విడుదల చేసిన గెజిట్‌ ప్రతులను శనివారం దగ్ధం చేశారు. యుటిఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యాయలంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు పాల్గనిమాట్లాడారు. ఓపిఎస్‌ అమలు కోసం ఏళ్ల తరబడి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం సిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిందన్నారు. ఇచ్చిన హామీని విస్మరించి జిపిఎస్‌ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. తమ పోరాటాల ఫలితంగా తాత్కాలికంగా ఉత్తర్వులను విడుదల చేయలేదన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం జిపిఎస్‌ చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అనేక ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వీటికి అనుగుణంగా పనిచేస్తుందని భావించామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెలలోపే జిపిఎస్‌ అమలు చేస్తూ చట్టం అమల్లోకి తీసుకురావడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెన్షన్‌ అనేది ఉద్యోగి హక్కు అని, సిపిఎస్‌, జిపిఎస్‌లను రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయలతో రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఒపిఎస్‌ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి మనోహర్‌, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు, సుందరయ్య మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయనిఆశించామని అన్నారు. నెల రోజుల్లోనే ఉద్యమ బాటపట్టించే పరిస్థితి తెచ్చారని అన్నారు. జిపిఎస్‌పై తెచ్చిన జివో 54ను వెంటనే రద్దు చేయాల నిడిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి బి రెడ్‌స్టార్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఏ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

కాకినాడ : గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేస్తూ అమలు చేయడానికి ప్రయత్నించిన జిపిఎస్ విధానానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పోరాటానికి పిలుపునిచ్చింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శనివారం జిపిఎస్ విధానానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను కాకినాడ జిల్లా యుటిఎఫ్ శాఖ ఆధ్వర్యంలో కచేరి పేట వద్దగల అంబేడ్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేశారు

కడప అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023, అక్టోబర్ 20వ తేదీ నుంచి జిపిఎస్ పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తూ ప్రభుత్వం విడుదల చేసిన రాజ పత్రాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్ చేశారు. శనివారం కడప కలెక్టరేట్ ఎదుట జిపిఎస్ అమలు పరుస్తూ ఇచ్చిన రాజపత్రాలను దహనం చేశారు.

 

కృష్ణా జిల్లా : సిపిఎస్ ఉద్యోగులకు జిపిఎస్ అమలు చేస్తూ రాజపత్రం విడుదల చేయడాన్ని నిరసిస్తూ యుటిఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపుమేరకు యుటిఎఫ్ కృష్ణా జిల్లా కార్యాలయం ఎదుట శనివారం జిపిఎస్ గెజిట్ కాపీలను దగ్ధం చేసి జిఓలను మంటల్లో వేసి దహనం చేసి నిరసన తెలియజేశారు.

➡️