నేవీ ఆయుధ డిపోకు వ్యతిరేకంగా గ్రామసభ తీర్మానం

  • ఎమ్మెల్యే ఎదుట వంకావారిగూడెం వాసులు ముక్తకంఠంతో నిరసన

ప్రజాశక్తి – జీలుగుమిల్లి (ఏలూరు జిల్లా) : నేవీ ఆయుధ సామగ్రి డిపోను తమ ప్రాంతంలో పెట్టేందుకు వీల్లేదని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీ పరిధిలోని ప్రజలు ముక్తకంఠంతో గ్రామసభలో తీర్మానం చేశారు. వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో ఈ డిపో ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌ తహశీల్దార్‌ సందీప్‌ అధ్వర్యంలో సర్పంచి కుంజా పార్వతి అధ్యక్షతన సోమవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాస్‌ ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రెండుసార్లు గ్రామసభల్లో వ్యతిరేకించి తీర్మానాలు చేయడంతోపాటు జిల్లా కలెక్టర్‌కు ‘స్పందన’ కార్యక్రమంలోనూ ఆయుధ డిపోకు వ్యతిరేకంగా వినతులు ఇచ్చామని గుర్తు చేశారు. గ్రామసభ ఆమోదం లేకుండా ఎటువంటి కార్యక్రమం జరగదని అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారని తెలిపారు. మళ్లీ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామసభ అంటూ రావడం తమను భయభ్రాంతులకు గురి చేస్తోందని గిరిజనులు వాపోయారు. నేవీ ఆయుధ డిపో నిర్మిస్తే ఏజెన్సీకి మనుగడ లేకుండా పోతుదందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌, జల్లేరు, పోగొండ జలశయాలకు గిరిజనులు భూములు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వాలు, అధికారులు మాటలు చెప్పారని, తీరా భూములు ఇచ్చాక గిరిజనులను నట్టేట ముంచారని వాపోయారు. మళ్లీ ఇప్పుడు నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు భూసేకరణ అంటూ ఏజెన్సీ నుంచి తమను తరిమి కొట్టడానికి సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధ డిపో ఏర్పాటైతే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు లేకుండా పోతారన్నారు. దీనిపై ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నేవీ ఆయుధ సామగ్రి డిపో ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిపారు. మీ సందేహాలను రాత పూర్వకంగా ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికీ తెలిసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు తెల్లం దుర్గారావు, మడకం వెంకటేశ్వరరావు, మడకం శేషగిరి, కుంజా రాముడు, పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

➡️