ప్రజాశక్తి-అమరావతి :టిడిపి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు చేసిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరపాలెం పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ గత సిఐడి అదనపు ఎస్‌పి విజయ్ పాల్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు పోలీసులకు నోటీసులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కు వాయిదా వేస్తూ జస్టిస్ విఆర్ కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కులాలు, వర్గాల మధ్య విబేధాలు రేకెత్తేలా రాఘురామ మాట్లాడి గత ప్రభుత్వాన్ని అస్తిరపాలు చేశారంటూ సిఐడి 2021లో కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో తనను హింసించి, గాయపరిచారంటూ రఘురామ అప్పటి సిఐడి అధికారి విజరు పాల్, గత సిఎం వైఎస్ జగన్, అప్పటి ఇంటెలిజెన్స్ అదనపు డిజి సీతారామాంజనేయులుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు ఇవ్వాలని పాల్ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
