- సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు ముందుకు వెళ్లేలా చర్యలు
- డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : గ్రీన్‌కో ఉల్లంఘనలను కేబినెట్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. శనివారం ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని గ్రీన్‌కో ప్రాజెక్టును సందర్శించారు. తొలుత విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్ ద్వారా సోలార్, జల విద్యుత్ ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గ్రీన్‌కో కార్యాలయం వద్దకు చేరుకుని ప్రాజెక్టు నమూనాను తిలకించారు. ప్రాజెక్టు గురించి సిబ్బంది, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్‌కో ఇప్పటికే రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, మరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల మందికి ఉపాధి కల్పించారని చెప్పారు. గ్రీన్‌కో ప్రాజెక్టులో అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణ రావడంతో పరిశీలించేందుకు వచ్చానన్నారు. పిన్నాపురం ప్లాంటుకు సంబంధించి 2800 ఎకరాల్లో ప్రాజెక్టు ఉందని, 1700 ఎకరాలను కంపెనీ కొన్నందని, 912 ఎకరాల అటవీ భూమిని కేంద్ర ప్రభుత్వ అనుమతితో తీసుకుందని, 112 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం ఉందని వివరించారు. ఆ వివాదాలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు చెప్పామన్నారు. భవిష్యత్‌లో గ్రీన్‌కో ప్రాజెక్టు గొప్ప సందర్శన ప్రదేశంగా, ఎడ్యుకేషన్ టూర్ ప్రాంతంగా తయారవుతుందని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో మూడో వంతు విద్యుత్‌ను గ్రీన్ కో ప్రాజెక్టు ఉత్పత్తి చేయనుందని చెప్పారు. దేశానికే పేరు తెచ్చే ప్రాజెక్టు అని, ఏదైనా వివాదాలు ఉన్నా పరిష్కరించి సహకరిస్తామని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటి (సిఎస్‌ఆర్) కింద గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, పశు సంపద పెంచేందుకు కృషి చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసిపి నాయకులు ఆక్రమించిన అటవీ భూములను గుర్తించి చర్యలు తీసుకుంటామని విలేకరుల అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. డిప్యూటీ సిఎంతో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్ధన్ రెడ్డి, గ్రీన్‌కో ఎండి అనిల్ చలమలశెట్టి, కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాష, నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి, నంద్యాల ఎస్‌పి అదిరాజ్ సింగ్ రాణా, జిల్లా అధికారులు ఉన్నారు.