గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫిబ్రవరిలో నిర్వహించాలి : డివైఎఫ్‌ఐ

Nov 2,2024 23:35 #DYFI, #Group-2 Mains, #held February

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించే గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలను జనవరి 5న నిర్వహిస్తామని ఎపిపిఎస్‌సి ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ప్రకటన గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. చదువుకునేందుకు కనీసం 90 నుంచి 120 రోజుల గడువు ఇవ్వాలని కోరారు. డిసెంబరులో కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌, రైల్వే పరీక్షలు వంటివి ఉండటం వల్ల సమయం సరిపోదని తెలిపారు. ఇంకా రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా ఎపి అర్థశాస్త్రం ఎలా చదవగలరని ప్రశ్నించారు. ఎపిపిఎస్‌సి పరీక్ష గడువును రీషెడ్యూల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎటువంటి వివాదాలు, కోర్టు జోక్యం లేకుండా పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి మూల్యాంకనం వరకు చిత్తశుద్ధి, నిజాయతీతో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

➡️