జ్యోత్స్నకు అశ్రునివాళి

Oct 10,2024 06:45 #accident, #lawyers, #passed away
  • భౌతికకాయాన్ని సందర్శించిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు

ప్రజాశక్తి- విజయవాడ  : రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన గుళ్లపల్లి జ్యోత్స్నకు బుధవారం పలువురు ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు నివాళులర్పించారు. ఆమె భౌతికకాయం ముంబయి నుండి విమానంలో బుధవారం ఉదయం 7.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. జ్యోత్స్న భర్త, ఐలు అఖిల భారత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎపి బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్‌ కూడా ఈ విమానంలో వచ్చారు. అనంతరం అక్కడి నుండి భౌతికకాయాన్ని విజయవాడలోని సీతారాంపురం సన్‌రైజ్‌ ఆస్పత్రి పక్కవీధిలోగల జ్యోత్స్న స్వగృహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, పలువురు న్యాయవాదులు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. భౌతికకాయం పై ఐద్వా, సిపిఎం పతాకాలను కప్పి ప్రజల సందర్శనార్థం ఉంచారు.

సిపిఎం నేతలు, ఎంఎల్‌ఎల నివాళి
జ్యోత్స్న భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, బి.తులసీదాస్‌, మంతెన సీతారాం, డి.రమాదేవి, కె.సుబ్బరావమ్మ, పార్టీ రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.స్వరూపరాణి, జయరాం, ప్రజాశక్తి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై.అచ్యుతరావు, ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు, ఎంఎల్‌ఎలు గద్దె రామమోహనరావు, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, వైసిపి ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్‌ తదితరులు ఆమె భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలు జాతీయ ఉపాధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నల్లారి ద్వారకానాథరెడ్డి, ఎపి హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కె.చిదంబరం తదితరులు జ్యోత్స్న భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జోత్స్న భర్త సుంకర రాజేంద్ర ప్రసాద్‌, కుమారులు అశీష్‌, అనీష్‌, కోడళ్లు ప్రీతి, శాయి ప్రశాంతి తదితరులకు సానుభూతి తెలియజేశారు.

నేడు ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత
జ్యోత్స్న భౌతికకాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాలకు అప్పగిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంటి వద్దకే మెడికల్‌ కళాశాల వైద్య సిబ్బంది వచ్చి తీసుకెళ్లనున్నారని చెప్పారు.

➡️