‘మీగడ’కు గురజాడ విశిష్ట పురస్కారం

Nov 30,2024 22:37 #for 'Meegada', #Gurjada, #Special Award
  • ప్రదానం చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ

ప్రజాశక్తి-విజయనగరం కోట : మహాకవి గురజాడ వెంకట అప్పారావు విశిష్ట పురస్కారాన్ని నంది అవార్డు గ్రహీత, రచయిత మీగడ రామలింగస్వామికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ప్రదానం చేశారు. గురజాడ అప్పారావు 109వ వర్థంతి సందర్భంగా శనివారం విజయనగరంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత గురజాడ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో రామలింగస్వామికి గురజాడ విశిష్ట పురస్కారాన్ని ఎన్‌వి రమణ అందజేశారు. సువర్ణ అక్షర గండ పిండేరం బిరుదును ప్రదానం చేశారు. అనంతరం ఎన్‌వి రమణ మాట్లాడుతూ గురజాడ తన రచనల ద్వారా ప్రశ్నించిన ఎన్నో సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయన్నారు. గురజాడను ఆదర్శంగా తీసుకొని వాడుక భాషను అభివృద్ధి చేయాలని కోరారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిందని, దీంతో మాతృభాషకు, తెలుగు ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని తెలిపారు. దీనిపై హైకోర్టులో కేసును కొట్టివేయడంతో గత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని చెప్పారు. తెలుగు భాషకు గౌరవం దక్కాలంటే గత సర్కారు పెట్టిన కేసును ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీని, మాండలికాలకు అనుగుణంగా అమరావతిలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు ప్రసంశా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకట అప్పారావు, ఇందిరా, కుటుంబ సభ్యులు, విజయనగరం డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️