వడగండ్ల వర్షం..అపార నష్టం

  • రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో దెబ్బతిన్న ఉద్యానపంటలు
  • నష్టాన్ని భరించలేక ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
  • సిఎం చంద్రబాబు ఆరా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాయలసీమలోని కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కురిసిన అకాల వర్షాల వల్ల ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, నీర్జంపల్లిలో పంట నష్టాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు అరటి రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్ప ఆదివారం ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 10 మండలాల్లోని 40 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్‌ పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల జరిగిన పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించినట్లు తెలి పారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా అకాల వర్షాలు, వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది.

ఆందోళన వద్దు : చంద్రబాబు

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఆందోళన పడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యాన రైతులకు భరోసా ఇచ్చారు. అనంతపురంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఆయన ఆరా తీశారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అనంతపురం జిల్లా కలెక్టర్‌తో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం తప్పిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మెరుగైన వైద్యం కోసం రైతులను అనంతపురానికి తరలిస్తున్నట్లు తెలిపారు.

అచెన్న టెలికాన్ఫరెన్స్‌

రాయలసీమలో వడగళ్ల వర్షం..అపార నష్టంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నా యుడు ఉద్యానవన శాఖ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనాలు వేయాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు.. రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.

➡️