వచ్చే సీజన్‌ నాటికి హంద్రీనీవా పనులు

  • లింకు పనులపై జలవనరులశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వచ్చే సీజన్‌ నాటికి హంద్రీనీవా ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి రాయలసీమ ప్రాంతంలో చివరి ఎకరం వరకూ సాగునీరందించేలా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులపై బుధవారం ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయం నుండి ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిపై మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులను గాలికి వదిలేసి రాయలసీమ రైతాంగానికి జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.2,629 కోట్లతో రాయలసీమ వరప్రదాయని అయిన హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి వచ్చే సీజన్‌కు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే గాలేరు నగరి సుజల స్రవంతి పథకం నుండి హంద్రీనీవాను కలిపే లింకు ప్రాజెక్టు పనుల గురించి, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుండి హంద్రీనీవాను కలిపే లింకు పనులపైనా ప్రత్యేకంగా చర్చించారు. ప్రధాన కాలువ చివరి వరకూ నీటిని తరలించేందుకు ఉన్న అడ్డంకులను వెంటనే పరిష్కరించేందుకు ఎటువంటి పనులు జరుగుతున్నాయనే వివరాలతో సమగ్ర నివేదిక తయారు చేసి త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి రిపోర్టు అందజేస్తామని తెలిపారు. సిఎం సూచనలకు అనుగుణంగా తదుపరి పనులు వేగవంతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

➡️