- పార్టీ సీనియర్ నేతలతో జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబునాయుడు చేతులెత్తేశారని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. లండన్ పర్యటన అనంతరం తాడేపల్లి వచ్చిన ఆయన వైసిపి కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో మంగళవారం సమావేశమైనారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్ హామీని అమలు చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ ఇప్పుడు ఆచరణకు సాధ్యం కాదని ప్రచారం చేస్తున్నారన్నారు. కేవలం అప్పులతో కాలం వెళ్లదీయడం వంటి అంశాలనూ ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు.
నాయకత్వం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మమేకం కావాలని సూచించారు. ఫీజుపోరుపై ఇసి అనుమతి పెండింగ్‌లో ఉండటంతో వాయిదా వేసినట్లు తెలిపారు. కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్రం వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు పెంచుతోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు సీట్లు వద్దని లేఖ రాయడం దారుణమని తెలిపారు. ఈ అంశాన్ని ఫీజుపోరులో భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఉప ఎన్నికల తీరుపైనా చర్చించారుఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.