ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగువారికి విశిష్టమైన సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. పాడిపంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా, మరిచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం : డిప్యూటీ సిఎం పవన్
పల్లె సౌభాగ్యమే, దేశ సౌభాగ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ధాన్యపు రాశులను లొగిళ్లకు మోసుకువచ్చే సంక్రాంతి పండుగకు ప్రజలందరీ శుభాకాంక్షలను తెలియజేశారు..
తెలుగు సంస్కృతికి ప్రతీక : వైసిపి అధినేత జగన్
తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ అందరి కుటుంబాలలో భోగభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
శాంతి సామరస్యాలు విరాజిల్లాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
సంక్రాంతి వేళ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సామరస్యాలు విరాజిల్లాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు తొలినుంచి మత సామరస్యానికి, శాంతి సామరస్యాలకు ప్రతీకగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో కొన్ని శక్తులు ప్రజల మధ్య ఉన్న ఈ ఐక్యతను విఛ్చినం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. సంక్రాంతి సందర్భంగా శాంతి సామరస్యాలను, తెలుగు వారి సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆనందం వెల్లి విరియాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పాడిపంటలతో రైతులు ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.